Jawahar nagar | జవహర్నగర్, ఏప్రిల్ 22: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్లోని సర్కారు భూముల్లో అక్రమ కట్టడాలను సహించబోమని కాప్రా తహశీల్దార్ సుచరిత హెచ్చరించారు. పేద ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల్లో అక్రమాలను నేలమట్టం చేస్తామని అన్నారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తూ అమాయకులను దోచుకుంటున్న కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సుచరిత హెచ్చరించారు. కార్పొరేషన్లోని భూములపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారని, త్వరలోనే కంచెలు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను కాపాడుతామని తెలిపారు. వర్షాలకు కూలిపోయిన ఇళ్లు, పాతది కూలగొట్టి కొత్తగా నిర్మించుకోవాలనే పేదల కోరికను కలెక్టర్కు విన్నవించామని చెప్పారు. త్వరలోనే జవహర్నగర్ వాసులకు శుభవార్త తెలుపుతామని అన్నారు.