ఉప్పల్, అక్టోబర్ 5 : ఉప్పల్ నుంచి నారపల్లి వరకు చేపడుతున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే పూర్తిచేయాలని కోరుతూ అక్టోబర్ 6న చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఉప్పల్ సర్కిల్ సీపీఎం కార్యదర్శి జే.వెంకన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు నిరాహార దీక్షకు మద్దతు కోరుతూ ఉప్పల్ ప్రధాన రహదారిలో షాపుల యాజమానులకు ఆదివారం కరపత్రాల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్లు గడుస్తున్న కారిడార్ పనులు పూర్తిచేయలేకపోయారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉప్పల్ ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కారిడార్ పనుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొని పనులు సత్వరం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు రాజు, మురళీమోహన్, జె.పట్టాబిరామయ్య, తదితరులు పాల్గొన్నారు.