బాలానగర్, జూన్ 4 : హైదరాబాద్ ఫతేనగర్‌లో రెండో ఆర్వోబీ నిర్మాణ పనులకు ప్రభుత్వం వెంటనే శ్రీకారం చుట్టాలని ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.
అనంతరం పండాల సతీశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఫతేనగర్ ఆర్వోబీ శిథిలావస్థకు చేరుకున్న కారణంగా తరచూ ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రెండో ఆర్వోబీ పనులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించినప్పటికీ ఆయా పనుల్లో పురోగతి కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూకట్పల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్వోబీ శిథిలావస్థలో ఉన్నందున దానికి తక్షణ కర్తవ్యంగా మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరులో మార్పులు రాకుంటే భవిష్యత్తులో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోరాదని భావించి ఫతేనగర్ ఆర్వోబీ మెట్ల మార్గం తొలగించి వేసినట్లు తెలిపారు. ఫతేనగర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం తక్షణమే ప్రత్యేక మార్గాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.