కుత్బుల్లాపూర్, జూన్ 19: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ షెడ్డు నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ నుండి ఎలాంటి అర్హతలు లేకుండా నిర్మాణదారులు విచ్చలవిడిగా భారీ షెడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిపై అధికారుల నిఘా లేకపోవడంతో అక్రమ నిర్మాణాదారులు రాత్రి, పగలు తేడా లేకుండా నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిర్మాణాల వెనకాల కొంతమంది అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కొత్తగా వచ్చిన ఉన్నతాధికారితో పాటుగా టౌన్ ప్లానింగ్ అధికారిని పర్యవేక్షణ చర్యలు తీసుకోక పోవడం వెనక ఆంతర్యమేమిటిని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు జయభేరిలో అనుమతులకు మించి బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరగడం పట్ల స్థానికుల నుండి ఫిర్యాదులు వెళ్లిన అధికారులు పట్టించు కోవడం లేదంటూ బహిరంగంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకానొక దశలో అధికారుల కింద పనిచేసే సిబ్బంది ఈ అక్రమ నిర్మాణాలకు వత్తాసు పలకడం కారణంగా రోజురోజుకు కొంపల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, షెడ్డు నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.