Jawahar Nagar | జవహర్‌నగర్, ఫిబ్రవరి 18: కూలీ పనిచేసుకుని బతికే వారిపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం చూపించారు. కనికరం కూడా లేకుండా వారిని ఇండ్లలో నుంచి బయటకు లాక్కొచ్చి.. ఇండ్లను నేలమట్టం చేశారు.
ఇండ్లల్లో పాచిపని, కూరగాయలు, కుట్టు మిషన్లు, తోపుడుబండ్లు లాగుకుంటూ బతుకువెళ్లదీసే వాళ్లే జవహర్‌నగర్‌లో అధికంగా నివసిస్తున్నారు. 40, 60 గజాల్లో చిన్నపాటి రేకులు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఏండ్లతరబడి అక్కడే జీవనం సాగిస్తున్న వీరికి నిలువ నీడ లేకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వారు ఇండ్లలో ఉండగానే పోలీసులు బయటకు ఈడ్చుకొచ్చి.. రేకుల ఇంటిని నేలమట్టం చేశారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని అరుంధతినగర్‌లో హెచ్ఎండీఏ భూములు సర్వే నెం. 702, 706లో పేదలు వేసుకున్న రేకుల ఇళ్లను హెచ్ఏండీఏ తహశీల్దార్ దివ్యరెడ్డి, రెవెన్యూ, పోలీసు యంత్రంగం సాయంతో మంగళవారం 10 ఇండ్లను నేలమట్టం చేశారు. హెచ్ఏండీ, రెవెన్యూ అధికారులు పేదల ఇండ్లపై బుల్డొజర్ తీసుకువచ్చి పూర్తిగా కూల్చివేశారు. అధికారుల తీరుపై పేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పేదలను బతకనియ్యదా అంటూ జవహర్ నగర్ ప్రజలు ప్రశ్నించారు. ఈ కూల్చివేతల్లో హెచ్ఎండీఏ అధికారులు, ఎస్సైలు రామునాయక్, వేణు, రెవెన్యూ సిబ్బంది రవి, సాయి, హెచ్ఎండీఏ సిబ్బంది పాల్గొన్నారు.
Jawahar Nagar2