ఉప్పల్, మార్చి 3 : ఉన్నత విద్య అభ్యసిస్తు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 7 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో హరీశ్‌రావు చేతుల మీదుగా ఆయన నివాసంలో ఎంబీబీఎస్ చెక్కులను అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు విద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఇది కేవలం దానంగా కాకుండా భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడిగా భావించాల్సిన అంశమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చే ప్రతిభావంతమైన యువతను ప్రోత్సహిస్తు, విద్య ద్వారా సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి నాగరాజు, మహేష్‌గౌడ్, వంజరి ప్రవీణ్ కరిపే, బోసాని పవన్‌కుమార్, దయాకర్‌రెడ్డి, శ్రవణ్, రఘువరణ్, నాని, రాజేష్‌గౌడ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.