ఘట్కేసర్, మార్చి 24: ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో హైదరాబాద్ కళాకారిణి సత్తా చాటింది. నృత్య పోటీల్లో ఉత్తమ కళాకారిణిగా మోక్ష ధృతి అవార్డు అందుకుంది.
న్యూఢిల్లీలోని రాజా రామ్మోహన్ రాయ్ మెమోరియల్ హాలులో అదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదినారాయణ నేతృత్వంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన మోక్ష అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ఉత్తమ కళాకారిణిగా అవార్డు అందుకుంది. ఆదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, లహరి నృత్యానికేతన్ కూచిపూడి డాన్స్ అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ పి ఝాన్సీరామ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్ష ధృతిని వారు అభినందించారు. మరిన్ని నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.