Double Bedroom Houses | మేడ్చల్, జూన్3(నమస్తే తెలంగాణ): అర్హులైన వారికి కాకుండా తమ కార్యకర్తలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేలా అధికారులపై కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతాప సింగారంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించేలా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని మాజీ మంత్రి మల్లారెడ్డిని విజ్ఞప్తిచేశారు. గతంలో డబుల్ బెడ్రూం కేటాయించేలా తమ పేర్లతో జాబితా సిద్ధం కాగా, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తమ వారితో కొత్త జాబితాను సిద్ధం చేశారని తెలిపారు. కాగా, వారికి అండగా నిలబడిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందేవరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించకుంటే బాధితులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
బాధితుల విజ్ఞప్తి మేరకు మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న కుట్రను ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి మాజీ మంత్రి మల్లారెడ్డి తీసుకెళ్లారు. అర్హులైన వారికి కాకుండా ఇతరులకు కేటాయించి సొమ్ము చేసుకునేందుకు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మంత్రికి వివరించారు. అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించే విధంగా చూడాలని కోరారు.