మేడ్చల్ కలెక్టరేట్, ఫిబ్రవరి 22 : సమగ్ర కుల గణన సర్వేలో పాల్గొనని వారు తమ పేర్లను సర్వేలో నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ర్ట బీసీ కమిషన్ సభ్యులు బాలలక్ష్మి సూచించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో శనివారం నాడు బీసీ కమిషన్ సభ్యులు పర్యటించి గతంలో నిర్వహించిన సర్వే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో ఎన్యూమరెటర్స్తో నిర్వహించిన సమావేశంలో అమె మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ, కులగణన సర్వేలో మిగిలి పోయిన కుటుంబాల వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించినందున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కుటుంబం వినియోగించుకునేలా సర్వే చేయాలని సూచించారు. దేశంలోనే మొట్టమొదట తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందని ఇంకా కొన్ని కుటుంబాలు సర్వేలో మిగిలిపోయినందున బీసీ కమిషన్ తరపున కూడా వారికి అవగాహన కల్పించి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు పాల్గొనేల చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశం అనంతరం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరెడ్డి నగర్ కాలనీలో సర్వేలో వివరాలు ఇవ్వటానికి నిరాకరించిన కుటుంబం ఇంటికి వెళ్లి సర్వేపై వారికి ఉన్న అనుమానాలు వివరించి వారి నుంచి సర్వే వివరాలు తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ నాగమణి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఝాన్సీ, మున్సిపల్ మేనేజర్లు చంద్రశేఖర్, వెంకటేశం, వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎన్యుమరేటర్స్, తదితరులు పాల్గొన్నారు.