మణుగూరు టౌన్, ఫిబ్రవరి 18 : ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) ప్రధాన గేటు ఎదుట బుధవారం ఆరు గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ సంస్థలో జీవో నెంబర్ 11, 60 అమలు చేయాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు.
బీటీపీఎస్‌లో కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, ప్రతీ నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. సంస్థ యాజమాన్యం కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ.. కార్మికులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీఈ బిచ్చన్నకు వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన ఆయన.. కాంట్రాక్టర్‌తో మాట్లాడి సోమవారంలోగా వేతనాలు చెల్లించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కాంట్రాక్టు కార్మికులు గద్దల శ్రీను, కొడిశాల రాములు, సత్రంపల్లి సాంబశివరావు, సత్యనారాయణ, సారిక, ఎగిడి రవి, భిక్షపతి, నాగరాజు, సూర్య, రమేశ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.