‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనే భక్తి భావనతో మొదటి అన్నం ముద్దను కండ్లకు అద్దుకుంటాం. కడుపు నిండా భోజనం పెట్టిన వారిని ‘అన్నదాతా సుఖీభవా!’ అంటూ వినమ్రంగా నమస్కరిస్తాం. వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తాం. చివరకు హోటల్‌కు వెళ్లినప్పుడు కూడా ఆహార పదార్థాలు వడ్డించిన సర్వర్ చేతికి సైతం ప్రేమగా ఎంతోకొంత డబ్బులు ఇచ్చి వస్తాం. తిండి గింజలు పండించే రైతును అన్నదాతగా గౌరవించుకుంటాం. ఇది ఈ దేశ ప్రజల సంస్కారం. కానీ, రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యవహార శైలి ఇందుకు విరుద్ధంగా ఉన్నది. అన్నం, వస్ర్తాలు అందించే రైతులను శాపగ్రస్తులను చేసే విధానాలు అవలంబిస్తున్నది. ధాన్యం, పత్తి, సోయాబీన్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్ల విషయంలో ఇప్పటికే అనేక పరిమితులు విధించింది.
రైతులను తాను ఇబ్బందులు పెట్టడమే కాకుండా, అన్నదాతలను ఏదో ఒక స్థాయిలో ఆదుకొనేందుకు ముందుకు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా కన్నెర్రజేస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖ! వరి పండించే రైతులకు కేరళలో అందజేస్తున్న బోనస్ ధరను నిలిపివేయాలన్నది ఆ లేఖ సారాంశం. ఇది ఒక్క కేరళకే కాదు, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ర్టాల రైతులకు కూడా పిడుగులాంటి దుర్వార్తే! ఇష్ట్టానుసారంగా ధాన్యం సేకరించడం వల్ల నిల్వలు పేరుకుపోతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని ఆ లేఖలో పేర్కొన్నది. రైతులకు బోనస్ ఆపకపోతే, ధాన్యం కొనుగోళ్లు చేయబోమని కూడా హెచ్చరించింది.
అయితే, ఎంఎస్పీతోపాటు బోనస్ కూడా చెల్లిస్తామని కేరళలోని వామపక్ష ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఒకవేళ కేంద్రం కొనకపోతే, తామే సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసే అంశాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. బోనస్ చెల్లింపులపై కేంద్రం ఇదే వైఖరి అవలంబిస్తే, తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలు ఏం చేస్తాయనేది ఆసక్తికర అంశం.
కేంద్ర ప్రభుత్వం వడ్లను రెండు రకాలుగా విభజించి కామన్ గ్రేడ్‌కు రూ.2,369, గ్రేడ్-1కు రూ.2,389 చొప్పున కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)గా నిర్ణయించింది. అయితే, తాము పెట్టే పెట్టుబడులతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ర్టాలు ధాన్యం, గోధుమలకు కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీకి అదనంగా మరికొంత జోడించి బోనస్ ధర అందజేస్తున్నాయి. కేరళతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు వరికి క్వింటాల్‌కు దాదాపు రూ.700 బోనస్ చెల్లిస్తున్నాయి.
గుజరాత్, రాజస్థాన్‌లోనూ గోధుమలకు కొద్ది మొత్తంలో బోనస్ అందజేస్తున్నాయి. తెలంగాణలో వరితోపాటు మరికొన్ని పంటలకు కూడా బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినప్పటికీ, సన్నధాన్యానికి మాత్రమే పరిమితం చేసింది. అయితే, రైతులకు బోనస్ డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నదనే విమర్శలున్నాయి. వడ్లకు కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతోపాటు ఆయా రాష్ర్టాలు ఇస్తున్న బోనస్ కూడా కలుపుకొంటే, క్వింటాల్‌కు రూ.2,800 నుంచి రూ.3,000 వరకు లభిస్తున్నది. రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మెడ మీద కేంద్రం ఆంక్షల కత్తి పెడుతున్నది.
బోనస్ చెల్లించి కొనుగోళ్లు చేయవద్దంటూ కట్టడి చేసేందుకు యత్నిస్తున్నది. ధాన్యం సేకరణ, బఫర్ స్టాక్‌ల నిర్వహణ, బోనస్ చెల్లింపులను కూడా ‘ప్రజాధనం దుర్వినియోగం’గా పరిగణించే స్థితిలో మోదీ సర్కార్ ఉన్నదంటే ఎవరి ప్రయోజనాలను కోరుతున్నట్టు? ఏ మార్కెట్ శక్తుల మేలును ఆశించి బోనస్‌పై అసహనం వ్యక్తంచేస్తున్నట్టు? అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరిందని గొప్పలు చెప్పుకొంటూ, ఆ ఒప్పందంలో ఏమున్నదో బహిర్గతం చేయకుండా, రాష్ర్టాలపై ఆంక్షల కత్తి ఎత్తుతున్న సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఒక్క ధాన్యం విషయంలోనే కాదు; పత్తి, సోయాబీన్ కొనుగోళ్ల విషయంలోనూ కేంద్రం వ్యవహరిస్తున్న తీవ్ర అభ్యంతరకరంగానే ఉన్నది. రైతుల నుంచి ఎకరానికి ఏడు క్వింటాళ్లకు మించి పత్తి కొనబోమని చెప్తున్నది. అలాంటప్పుడు అంతకు మించిన దిగుబడి సాధించిన రైతులు మిగిలిన పత్తిని ఎవరికి అమ్ముకోవాలి? ఏ మార్కెట్ శక్తులను ప్రాధేయపడాలి?
మరోవైపు, పెరుగుతున్న పంటల విస్తీర్ణం, రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా తదితర ఎరువులను అందుబాటులో ఉంచడంలో విఫలమవుతున్నది. దేశంలో యూరియా వాడకం దాదాపు 40 మిలియన్ టన్నులకు చేరుకోగా, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా ఉత్పత్తి మాత్రం 32 మిలియన్ టన్నుల లోపు ఉంటున్నది. లోటును పూడ్చుకొనేందుకు విదేశాల మీద ఆధారపడాల్సి వస్తున్నది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువుల ఉత్పత్తులు పెరగకపోవడం, ఉత్పత్తి అయిన వాటిని కూడా సకాలంలో ప్రణాళికాబద్ధంగా గ్రామాలకు చేర్చడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న కారణంగా యూరియా కొరత తీవ్ర సమస్యగా మారుతున్నది. రైతులకు ఈ కష్టాలు చాలవన్నట్టు యూరియా కొనాలన్నా, పత్తి అమ్ముకోవాలన్నా యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి చేసింది.
భవిష్యత్తులో ఈ విధానాన్ని ఇతర పంటలు, ఎరువులు, విత్తనాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రతి రైతూ తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాల్సిన దుస్థితిని సృష్టించింది. రైతుల మీద బలవంతంగా యాప్‌ల సంస్కృతిని రుద్దడంలో ఉద్దేశం ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కంపెనీల, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ విస్తృతికి ప్రభుత్వాలు అందిస్తున్న సహకారంగా భావించాలా? దీని మర్మమేమిటి? ఏ గ్రామంలో ఎంత వ్యవసాయ భూమి ఉన్నదో, ఏ భూమిలో ఏయే పంటలు పండిస్తున్నారో, శాటిలైట్ చిత్రాలు సహా కచ్చితమైన లెక్కలు ప్రభుత్వాల వద్ద ఉంటున్నాయి.
వాటికి అనుగుణంగా ముందుగానే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసి, పంపిస్తే రైతులకు ఇన్ని తిప్పలు ఉండవు కదా! విత్తనాలు, ఎరువుల కోసం రాస్తారోకోలు, ధర్నాలు చేసిన రైతులు, ఇప్పుడు ‘ఈ యాప్‌లు మాకొద్దు మహాప్రభో’ అంటూ ఆందోళనలు చేయాల్సిన దుస్థితిలో చిక్కుకుంటే అది రైతు సంక్షేమం అనిపించుకోదు. రైతులు ముక్తకంఠంతో కోరుతున్నది ఒక్కటే.. నీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని, పంటలకు శాస్త్రీయ పద్ధతిలో కనీస మద్దతు ధర ఇప్పించాలని, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపర్చాలని! వీటిని తీర్చితే చాలు!
కేంద్ర ప్రభుత్వం వడ్లను రెండు రకాలుగా విభజించి కామన్ గ్రేడ్‌కు రూ.2,369, గ్రేడ్-1కు రూ.2,389 చొప్పున కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)గా నిర్ణయించింది. అయితే, తాము పెట్టే పెట్టుబడులతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
-కందిబండ కృష్ణప్రసాద్ ,9182777010