CM Vijay : తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయ పోరు ఇకపై టీవీకే (TVK), డీఎంకే (DMK) మధ్య మాత్రమేనని, అన్నాడీఎంకే (AIADMK) కు చోటుండదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (Vijay) అన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సోమవారం తొలిసారిగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. తన పాలన ప్రజలందరి కోసం ఉంటుందని, రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని అన్నారు.
‘రాజకీయంగా చెబుతున్నా. ఇప్పుడు పోటీ కేవలం రెండు పార్టీల మధ్యే. ఒకటి డీఎంకే, మరొకటి టీవీకే. మధ్యలో ఇంకెవరికీ పాత్ర లేదు’ అని విజయ్ చెప్పారు. తమ పార్టీపై వస్తున్న హార్స్ ట్రేడింగ్ ఆరోపణలను ఖండించిన విజయ్.. అధికారం కోల్పోయిన డీఎంకే, అన్నాడీఎంకేలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘ఇన్నేళ్లుగా మిమ్మల్ని మోసం చేస్తున్న వారిని కాదని, మీ కోసం పనిచేయడానికి వచ్చిన మీ విజయ్‌ని, మీ అన్నని, మీ తమ్ముడిని ముఖ్యమంత్రిగా కాదు, మీ మొదటి సేవకుడిగా ఎన్నుకున్నారు’ అని వ్యాఖ్యానించారు.
తాను అధికారంలోకి వచ్చి కొద్ది వారాలే అయినా.. ఆరు నెలలు మౌనంగా ఉంటామని చెప్పిన వాళ్లు ఆరు రోజులు కూడా ఆగలేకపోయారని విమర్శించారు. చివరగా తాను సూట్ ధరించడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. సూట్ ఎందుకు వేసుకోకూడదని విజయ్ ప్రశ్నించారు.