ఇంట్లో బంగారానికీ లెక్కలు చూపాల్సిందే!
ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినప్పుడు వివాహిత మహిళ వద్ద లభించే 500 గ్రాముల వరకు బంగారాన్ని అధికారులు జప్తు చేయకూడదన్న నిబంధన చాలా సంవత్సరాలుగా దేశంలో అమల్లో ఉంది.
- ఐటీ శాఖ సోదాల్లో ఆదాయ వివరాలు తెలియజేయాలి
- 500 గ్రాముల పరిమితిపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించినప్పుడు వివాహిత మహిళ వద్ద లభించే 500 గ్రాముల వరకు బంగారాన్ని అధికారులు జప్తు చేయకూడదన్న నిబంధన చాలా సంవత్సరాలుగా దేశంలో అమల్లో ఉంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉన్నందుకు ఎటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని చాలామంది భావించారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దీనిపై ఒక స్పష్టతనిచ్చింది. బంగారాన్ని స్వాధీనం చేసుకోకపోవడం, దాని యాజమాన్యం అనేవి రెండు వేర్వేరు విషయాలని జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ పల్లితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్‌కు చెందిన ఒక మాజీ అధికారిణికి సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. తన వద్ద 500 గ్రాముల బంగారం ఉందని పేర్కొంటూ ఆమె తనపై చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. బీహార్ శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ మాజీ అధికారిణి ఫూల్‌పరి కుమారిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు కేసు నమోదైంది. 2015లో బీహార్ విజిలెన్స్ శాఖ ఈ కేసు నమోదు చేసింది. ఆమె వద్ద 646.400 గ్రాముల బంగారు ఆభరణాలు దర్యాప్తు అధికారులకు లభించాయి. అవివాహిత మహిళ వద్ద ఉండే 500 గ్రాముల బంగారం, అవివాహిత కుమార్తె వద్ద ఉండే 250 గ్రాముల బంగారం జప్తు నుంచి మినహాయింపు పొందుతాయని ఆమె వాదించారు.
ఈ ఏడాది మేలో పాట్నా హైకోర్టు ఆమెపై జరుగుతున్న విచారణ ప్రక్రియను కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తూ 500 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చన్న నిబంధన ఇక్కడ వర్తించదని, ఆదాయ పన్ను శాఖ సోదాల సందర్భంగా ఆ బంగారాన్ని ఏ ఆదాయంతో కొన్నారో లెక్కలు చూపాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమెపై విచారణ ప్రక్రియను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీచేసింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
1994 మేలో సీబీడీటీ జారీచేసిన ఆదేశాల ప్రకారం వివాహిత మహిళ 500 గ్రాముల వరకు, అవివాహిత మహిళ 250 గ్రాముల వరకు, పురుషుడు 100 గ్రాముల వరకు బంగారాన్ని తమ వద్ద చట్టబద్ధంగా ఉంచుకోవచ్చు. అయితే ఆదాయ పన్ను శాఖ దాడి జరిగిన సందర్భంలో ఆ బంగారాన్ని చట్టబద్ధమైన ఆదాయంతో కొనుగోలు చేసినట్టు నిరూపించుకోవలసి ఉంటుంది.
సాధారణ పౌరులందరూ తమ వద్ద ఉన్న ఆభరణాల వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు కోరలేదు. అలాగే ఆభరణాలను జప్తు చేయకుండా రక్షణ కల్పించే నిబంధనను కూడా కోర్టు తొలగించలేదు. ఏదేమైనా కొత్త లేదా పాత ఆభరణాలకు సంబంధించిన బిల్లులు, రసీదులను ప్రతి వ్యక్తి తమ వద్ద ఉంచుకోవడం తప్పనిసరని అధికారులు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

