మోదీ.. మేకిన్ ఇండియా ఏదీ?
మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం నీరుగారిపోతున్నది.
- అటకెక్కిన ప్రతిష్ఠాత్మక పథకం
- ఇప్పటికీ ప్రతిదానికీ చైనాపైనే ఆధారపడుతున్న భారత్
- ఆ దేశంతో వాణిజ్య లోటు ఏకంగా 112 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మేకిన్ ఇండియా పథకం నీరుగారిపోతున్నది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన బీజేపీ సర్కార్.. పథకం అమలులో చిత్తశుద్ధిని కనబరచడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ పారిశ్రామిక స్వావలంబన లక్ష్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2025-26ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 112 బిలియన్ డాలర్లకు చేరింది. ఏ ఒక్క దేశంతోనూ భారత్‌కు ఇంత భారీ వాణిజ్య లోటు లేదు. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక యంత్రాలు, రసాయనాలు.. ఈ మూడు రంగాలే చైనా నుంచి భారత్ చేసుకుంటున్న మొత్తం దిగుమతుల్లో దాదాపు 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. కొన్ని కీలక ఉత్పత్తుల దిగుమతుల్లో చైనా వాటా 80 శాతానికిపైగానే ఉన్నది.
ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనా విడిభాగాలే కీలకం
భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్ కాస్త పురోగతి సాధించింది. అయితే, ఈ తయారీకి అవసరమైన చిప్‌లు, లిథియం, బ్యాటరీలు, సౌర విద్యుత్ సెల్స్ వంటి కీలక విడిభాగాల కోసం చైనాపైనే ఆధారపడాల్సి వస్తున్నది. 2025-26లో భారత్ చేసుకున్న ఎలక్ట్రానిక్స్ దిగుమతుల్లో చైనా వాటా 46.3 బిలియన్ డాలర్లు(44.2 శాతం). హాంకాంగ్ నుంచి మరో 11.2 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. చైనా ఉత్పత్తులను ఇతర దేశాలకు తిరిగి ఎగుమతి చేసే కేంద్రంగా హాంకాంగ్ కూడా పనిచేస్తున్నది. దేశీయంగా విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు 2025లో కేంద్రం రూ.22,900 కోట్లతో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పథకాన్ని ప్రారంభించింది.
పారిశ్రామిక యంత్రాలకూ చైనాపైనే ఆధారం
గనులు, నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలకు అవసరమైన భారీ యంత్రాల విషయంలోనూ చైనా కీలక సరఫరాదారుగా ఉన్నది. 2025-26లో భారత్ చైనా నుంచి 29.4 బిలియన్ డాలర్ల విలువైన పారిశ్రామిక యంత్రాలను దిగుమతి చేసుకుంది. ఈ విభాగంలో భారత్ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 39.7 శాతం. క్రేన్లు, బుల్డోజర్లు, సొరంగాల తవ్వక యంత్రాల వంటి భారీ పరికరాల దిగుమతుల్లో చైనా వాటా 45 నుంచి 75 శాతం వరకు ఉంది.
ముఖ్యంగా అల్లిక, కుట్టు యంత్రాల దిగుమతుల్లో చైనా వాటా 87.7 శాతం. వ్యవసాయ రంగంలో పంట కోత, నూర్పిడి యంత్రాల దిగుమతుల్లోనూ చైనా వాటా 76 శాతంగా ఉన్నది. సొరంగాల తవ్వకానికి ఉపయోగించే యంత్రాల ఎగుమతులపై చైనా ఇటీవల ఆంక్షలు విధించడంతో భారత్‌లో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. దీంతో ఈ యంత్రాలను తయారుచేస్తున్న జర్మనీ సంస్థతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు భారత్ ప్రయత్నించింది.
ఔషధాల తయారీలోనూ చైనా ముడిసరుకులే
2025-26లో భారత్ మొత్తం రసాయనాల దిగుమతులు 81.3 బిలియన్ డాలర్లు కాగా, అందులో సేంద్రియ రసాయనాల వాటా 25.4 బిలియన్ డాలర్లు. ఈ సేంద్రియ రసాయనాల దిగుమతుల్లో చైనా వాటా 43.5 శాతం . ఔషధాల తయారీకి అవసరమైన కీలక ప్రారంభ ముడిపదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల సరఫరాలో చైనా కీలక పాత్ర పోషిస్తున్నది. 2025-26లో భారత్ దిగుమతి చేసుకున్న పెనిసిలిన్లో 81 శాతం, రిఫాంపిసిన్లో 86 శాతం, క్లోరాంఫెనికాల్లో 95 శాతం, ఎరిత్రోమైసిన్లో 99 శాతం చైనా నుంచే వచ్చాయి.
ఎరువులు, పురుగు మందుల తయారీకి అవసరమైన రసాయనాల విషయంలోనూ భారత్ దిగుమతులపై ఆధారపడుతున్నది. 2025-26లో 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకోగా, ఇందులో చైనా వాటా 19.6 శాతంగా ఉన్నది. దేశంలో తయారీ రంగంలో స్వావలంబన సాధించాలంటే కేవలం సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలతో సరిపోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశోధన, అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

