కుత్బుల్లాపూర్, మార్చి1: సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని.. సర్వే పూర్తయినప్పటికీ ఇప్పటివరకు తమకు గౌరవ వేతనం అందివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ధర్నా చేపట్టారు. అనంతరం డీసీ నరసింహకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్టీయూఎఫ్ అధ్యక్షుడు ఎస్.పురుషోత్తం మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇంటింటికీ తిరుగుతూ చేసిన పనికి ఫలితంగా ప్రభుత్వం తమకు గౌరవ వేతనం 10వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ఇప్పటివరకు గౌరవ వేతనం ఇవ్వకుండా తమతో వెట్టిచాకిరి చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షులు యస్ పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి కె కుమారస్వామి. యస్ సంగీత, జి.భారతి, గోపీయ, వేంకటేశం, నర్సింహ, మల్లిఖార్జున్, చంద్ర శేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, హారేరాం పెద్ద సంఖ్యలో ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.