Hyderabad | దుండిగల్ ఫిబ్రవరి 28: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 30 వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ నుంచి మెయిన్ రోడ్ (వాటర్ ట్యాంకు) వెళ్లే రోడ్డులో శ్రీరామ్ కుంట చెరువు, కురుమ బస్తి మధ్యనున్న రోడ్డులో డ్రైనేజీ నీరు మాన్హోల్ నుంచి పొంగిపొర్లుతుంది. గత కొన్ని రోజులుగా ఈ సమస్య ఇక్కడ నెలకొన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోడ్డు కాస్త చిన్నపాటి కుంటగా మారింది.
ప్రతినిత్యం ఈ రహదారిలో వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలతో బిజీగా ఉంటుంది. మురుగునీరు రోడ్డుపై తిష్ట వేయడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఆకతాయిలు వేగంగా వెళుతుండటంతో మురుగునీరు వెళ్లి ఇతర వాహనదారులపై పడుతుండటం ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు దుర్వాసనతో అటు కుమ్మరి బస్తీ వాసులు, ఇటు శ్రీరామ కుంట వాకింగ్ ట్రాక్‌లో వ్యాయామం చేసేవారు ముక్కు మోసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ సమస్య ఇక్కడ తరచూ ఏర్పడుతుండటంతో మురుగునీటి రోడ్డు పైకి చేరకుండా శాశ్వతంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.