కాప్రా, ఏప్రిల్ 04 : 2025-2026 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.జగన్ కోరారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గృహస్తులు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను 5 శాతం రాయితీతో ముందస్తుగా చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకొని తమ గృహ, వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించాలని కోరారు. ఈనెల 1వ తేదీ నుంచి ఎర్లీ బర్డ్ పథకం ప్రారంభమైందని, ఈనెల 30 వరకు మాత్రమే ముందస్తు పన్ను చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎర్లీ బర్డ్ పథకానికి స్పందన….
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్ పథకానికి కాప్రా సర్కిల్లో స్పందన బాగానే లభిస్తోంది.ఈనెల 1 న ఈ పథకం ప్రారంభం కాగా, శుక్రవారం వరకు(నాలుగు రోజుల్లోనే) రూ.1.98 కోట్లు (ఎర్లీ బర్డ్)ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులు జరిగినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది(2024-2025) ఏప్రిల్ నెలలో ఎర్లీ బర్డ్ పథకం కింద ₹27.79కోట్ల ఆస్తి పన్ను వసూలు అయిందని, ఈ ఏడాది (2025-2026) ఎర్లీ బర్డ్ పథకం టార్గెట్ రూ.34 కోట్లుగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించినట్లు, దీన్ని తప్పక సాధిస్తామని సర్కిల్ డీ సీ ధీమా వ్యక్తం చేశారు.