దుండిగల్,సెప్టెంబర్7 : అర్హులైన పేదప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుంటే డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు ప్రభుత్వభూములను ఆక్రమిస్తామని కుత్బుల్లాపూర్ మండలం,సీపీఎం పార్టీ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ హెచ్చరించారు. సూరారం డివిజన్ పరిధి,షాపూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పారిశ్రామిక ప్రాంత లోడింగ్ అండ్ అన్ లోడింగ్ హమాలీ కార్మికుల సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ లక్ష్మణ్ మాట్లాడుతూ దేశంలో సుమారు 60లక్షల మంది అసంఘటితరంగ కార్మికులు ఎటువంటి చట్టాలు, హక్కులకు నోచుకోకుండా పనిచేస్తున్నారని, వారికి కనీసం ఉండటానికి ఇండ్లు కూడ లేవన్నారు.
సంపాదించిన దాంట్లో సగం వరకు ఇంటిఅద్దెలే చెల్లిస్తూ బతుకును భారంగా వెల్లదీస్తున్నారన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఇచ్చే హామీలతో పార్టీలు మారినపుడల్లా ఇండ్లకోసం దరఖాస్తు చేస్తూ ఎదురుచూస్తూనే ఉంటున్నారన్నారు. అయినప్పటికి వారి సొంత ఇంటికళ కలగానే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో గతప్రభుత్వం నిర్మించిన వేలాది ఇండ్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే ఇండ్లులేని పేద ప్రజలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన 6గ్యారేంటీల అమలులో ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇండ్లులేని పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు. లేని పక్షంలో పేదలతో కలిసి ఖాళీగా ఉన్న డబుల్ ఇండ్లతో పాటు ప్రభుత్వభూములను ఆక్రమించి, గుడిసెలు వేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు శ్రీనివాస్, కరుణాకర్, అంజయ్య, నర్సింహులు, దుర్గానాయక్, తిమ్మప్ప ,శ్రీశైలం, యాదవరెడ్డి, కనకయ్య, వీరేశ్, భాషా తదితరులు పాల్గొన్నారు.