MLA Madhavaram Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 2: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయించకుండా పోరాడుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
ఇవాళ కూకట్పల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో కాలుష్య తీవ్రత పెరుగుతుందని ఓ వైపు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుందని… మరోవైపు ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగేలా.. నగరంలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు యత్నించడం బాధాకరమన్నారు. నాడు ప్రధాని ఇందిరాగాంధీ హెచ్సీయూకు కేటాయించిన భూములను నేడు ఇందిరమ్మ వారసులు అమ్ముకోవడానికి చూస్తున్నారని విమర్శించారు.
అభివృద్ధి చేయకుండానే అప్పులు….
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పదేళ్ల కాలంలో నాలుగు లక్షల 17 వేల కోట్లు అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఒక లక్ష 57 వేల కోట్ల అప్పులను చేసిందని విమర్శించారు. నాడు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను, నగరంలో ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించామని.. నేడు పనులు చేయకుండానే అప్పులు చేస్తున్నారని విమర్శించారు.
నాడు పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో కోట్లాది మొక్కలను నాటి పచ్చదనాన్ని కాపాడామని.. నేడు హెచ్సీయూలో పచ్చని మొక్కలను, జంతు జీవాలను హరిస్తూ భూములను అమ్ముకోవాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. కూకట్పల్లిలో 517 ఎకరాల ఉదాసీన్ మఠం భూములను కాపాడామని, పలుచోట్ల హౌసింగ్ బోర్డు స్థలాలను కాపాడినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20, 30 గజాల స్థలాలను సైతం ప్రజా అవసరాల కోసం కాకుండా అమ్మకానికి పెట్టడం సరికాదన్నారు…
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాడాలి..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని… విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటుందని తెలిపారు. నగరంలో నివసిస్తున్న ప్రజలందరూ ఈ విషయంపై స్పందించాలని వివిధ మీడియా మార్గాల్లో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాడాలన్నారు. భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషమన్నారు.
హైదరాబాద్ నగరాన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు సంఘటితంగా ముందుకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.