చర్లపల్లి, మే 5 : ఔత్సహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్స్రీ జాయింట్ డైరక్టర్ కె.మధుకర్‌బాబు తెలిపారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్2లోని పారిశ్రామికవేత్తల భవనంలో సెంట్రల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టూల్, డిజైన్(సీఐటీడీ)ఆధ్వర్యంలో ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఎంఈ, ఆర్ఏఎంపీలతో కలిసి పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మధుకర్ బాబు మాట్లాడుతూ.. పారిశ్రామికవాడల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి యుగంలో కొత్త టెక్నాలజిలో అగ్రగామిగా కొనసాగేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కొత్త టెక్నాలజీతో నూతన పరిశ్రమలను స్థాపించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అనంతరం సీఐటీడీ ప్రిన్సిపాల్ డైరెక్టర్ డాక్టర్ టి.విజయ్ కృష్ణకాంత్, ఆర్‌ఏఎంపీ జీటీ భారత్, ఎల్ఎల్పీ అసోసియేట్ డైరెక్టర్ మహ్మద్ జైదీ, చర్లపల్లి పారిశ్రామికవాడ ఐలా చైర్మన్ రోషిరెడ్డి, చర్లపల్లి సీఐఏ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కుషాయిగూడ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు యాదయ్య, విద్యసాగర్, దళిత ఇండస్ట్రీయల్ అసోసియెషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురావులు ప్రసగించారు. అనంతరం సీఐటీడీ డిప్యూటీ డైరక్టర్ సనాత్ కుమార్, ఎంఎస్ఎంఈ గ్రీన్ ప్రాజెక్ట్ మేనేజర్ చరణ్‌లు పవర్ ప్రాజెక్ట్ ద్వార పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు.