కేపీహెచ్‌బీ కాలనీ, మే 27 : కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కైత్లాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సామాన్య ప్రజలు హైటెక్‌సిటీకి వెళ్లాలంటే నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడేవారన్నారు.
ఈ ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించేందుకు కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిని, రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించినట్లు తెలిపారు. కైత్లాపూర్ నుంచి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వరకు నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మిణ పనులు చివరి దశలో ఉన్నాయని.. జూన్ 2వ వారంలో ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే బోయిన్పల్లి, బాలానగర్, ఎర్రగడ్డ, మూసాపేట, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు హైటెక్‌సిటీ వైపుకు వెళ్లేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
కానీ.. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రజల్లో మత విద్వేశాలను రెచ్చగొట్టకుండా అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష, సబీహాగౌసుద్దీన్ ఆయా విభాగాల అధికారులున్నారు.