అల్లాపూర్, మే 6: రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చలానాలు విధించడంతోపాటు, కేసులు కూడా నమోదు చేస్తామని బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేశ్ హెచ్చరించారు. మంగళవారం మోతీ నగర్ పరిధిలోని కబీర్ నగర్, అవంతినగర్ కాలనీల్లో అంతర్గత రోడ్లపై అక్రమంగా వాహనాలను పార్క్ చేసిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల వల్ల ట్రాఫిక్ స్తంభించే అవకాశాలు ఉంటాయని అన్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని, వాహనాల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఎంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనదారులు అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందని చెప్పారు.