బోడుప్పల్, మార్చ్ 14: ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బోడుప్పల్ బిఎల్ నగర్ కాలనీ(BL Nagar colony) వాసులు చేపట్టిన ఆందోళనకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మద్దతు తెలిపారు. ప్రజల ఆమోదం లేకుండా తీసుకుంటున్న చర్యలను అడ్డుకొని తీరుతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. జనావాసాల మధ్య బోడుప్పల్ బీఎల్ నగర్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులపై స్థానికులు ఆగ్రహంగా ఉన్నారని, వెంటనే సబ్ స్టేషన్ పనులను వేరే ప్రాంతానికి తరలించాలని మంద సంజీవరెడ్డి కోరారు. ఇరుకుగా ఉన్న రోడ్డు మధ్యలో నుండి హై టెన్షన్ వైర్లు రావడం పట్ల స్థానిక బీఎల్ నగర్ కాలనీ, సాయి ఎన్క్లేవ్, ఎస్బీఆర్ కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన తెలిపారు.
సబ్ స్టేషన్ పనులు వెంటనే నిలిపివేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బీఎల్ నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థలాన్ని కేటాయించిందని సంజీవరెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో వోల్టేజీ సమస్య అసలు లేనేలేదని, కావాలని కాలనీ మధ్యలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.