దుండిగల్ : కాలనీలు, బస్తీలలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీల సభ్యులు శంభీపూర్ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమతమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు కృష్ణ సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ల దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.