BJP Leader | తెలంగాణ బీజేపీ నేత ఒకరు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని పేదల నుండి రూ.20 కోట్లు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు బీజేపీ నేత పేదల నుండి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ భూమిలో పట్టాలు చేయించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. హిమాయత్‌నగర్ డివిజన్ విఠల్ వాడికి చెందిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నంబర్ 58లో 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని పేదలను నమ్మించి 60 గజాల స్థలం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుండి రూ.60 వేల నుండి రూ.3 లక్షల చొప్పున తీసుకున్నాడని తెలుస్తోంది.
ఇలా మొత్తం సుమారు రూ.20 కోట్లు వసూలు చేసి పట్టాలు కూడా ఇప్పించగా.. లబ్ధిదారులు ఆ పట్టాలు తీసుకుని భూమి వద్దకు వెళ్లి చూడగా అది ప్రభుత్వ భూమి అని తెలిసి భూ పరిపాలన కార్యాలయానికి వెళ్లి అడిగితే అవన్నీ నకిలీ పట్టాలని అధికారులు తేల్చినట్టు సమాచారం. దీంతో బాధితులు సదరు బీజేపీ నాయకుడిని నిలదీసేందుకు వెళితే సీపీఐ వాళ్లు ఇచ్చారని చెప్పండి అంటూ బుకాయించాడని, తమ డబ్బులు తిరిగి ఇవ్వమంటే దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బీజేపీ నాయకుడిని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.