MLA Kunamneni Samba Shivarao | కాప్రా, మే 25 : ఎర్రకోటపై జెండా ఎగురవేసే లక్ష్యంగా వామపక్షపార్టీలన్నీ ఏకమై ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపు ఇచ్చారు. ఈసీఐఎల్ సమీపంలోని బంజారా ఫంక్షన్ హాల్లో జరిగిన సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 4వ మహాసభకు కూనంనేని ముఖ్యఅతిథిగా విచ్చేసి సీపీఐ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.
సీపీఐ సహాయ కార్యదర్శి జి.దామోదర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభలో ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ.. శ్రామిక కార్మిక, కర్షక, నిరుపేదల పక్షాన పోరాడుతూ వందేళ్ల కాలంగా ప్రజల మదిలో నిలిచిపోయింది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమై కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలను అణచివేసే దిశగా గత పదేళ్లుగా పాలిస్తూ ఒక్కొక్కటిగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింటిని అంబానీ, అదానీ వంటి సంపన్న వర్గాలకు ప్రైవేటీకరణ పేరిట అప్పజెప్పి వారు ఇచ్చే డబ్బులతో ఎన్నికలలో ఓట్లు దండుకుంటూ అత్యంత ప్రమాదకరంగా తయారైందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిందేనని ఉద్ఘాటించారు.
ప్రజాసమస్యల సాధనే లక్ష్యంగా జీవితాలను ఫణంగాపెట్టి అడవుల్లో కాలం గడుపుతూ పోరాటం చేస్తున్న మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరిట హతమార్చే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిందని, చర్చలకు సిద్దమని కోరుతున్నా. అవకాశం ఇవ్వడంలేదని అన్నారు. ఇస్లాం రాజ్యమే లక్ష్యంగా నర మేధానికి పాల్పడుతున్న ఉగ్రవాద ఉదంతాలు మన దేశంతోపాటు ఇతర దేశాల్లో జరుగుతున్నాయని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష, లౌకికశక్తులు అన్నీ ఏకం కావాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అర్హులకు దక్కేలా సీపీఐ శ్రేణులు పోరాటం చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. అన్నివర్గాలను సమీకృతం చేస్తూ ముందుకు వెళ్లే సత్తా సీపీఐకి మాత్రమే ఉందన్నారు. సీపీఐ వందేళ్లుగా ప్రజల మద్య నిరంతరం ఉంటూ బలీయమైన పార్టీగా నిలిచిందని అన్నారు. సభకు ముఖ్యఅతిథులుగా హాజరైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వీ.ఎస్.బోస్, ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్ తదితరులు ప్రసంగించారు.
సీపీఐ నాయకులు, ఇతర ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, మహాసభకు ముందు ఈసీఐఎల్ చౌరస్తా నుంచి సభాస్థలివరకు సీపీఐ శ్రేణులు ఎర్రజెండాలు చేతపట్టుకొని పార్టీ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.