దుండిగల్, ఏప్రిల్ 18: మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు సకాలంలో అందకపోవడంతో శుక్రవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసే సిబ్బందికి, ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీన రావాల్సిన జీతాలు ఇప్పటివరకు అందకపోవడం బాధాకరమని అన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు ప్రతి నెల వారి జీతం ఆలస్యంగా ఇస్తే వారు ఎలా బతకాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే సమస్యను పరిష్కరించి కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.