Fraud | కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 : తానొక ఎంపీ కొడుకునని, న్యూరో సర్జన్‌గా పని చేస్తున్నానంటూ నమ్మించి ప్రజలను అమాయకులను చేసి పలు మోసాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లు గప్పి తిరిగాడు. చివరకు ఆ నిందితుడు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. బాలానగర్ జోన్ డీసీపీ కె.సురేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వీఐపీ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వయిల వెంకటేశ్వర్లు (29) తన పేరును డా విక్రాంత్ రెడ్డి అనే నకిలీ పేరుతో చెలామణి చేస్తూ పలువురిని తన మాయమాటలతో గారడిలో పెట్టి ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు.
ఇదే క్రమంలో కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జేఎన్టీయూకు ఎదురుగా సితార ఉమెన్స్ హాస్టల్‌ను నడుపుతున్న ఓ మహిళను తన మాయమాటలు చెప్పి పలుమార్లు హాస్టల్లో ఉన్న మెస్‌కు వెళ్లాడు. దీంతో తన బంధువులు, తన జూనియర్లను హస్టల్లో చేర్పిస్తానంటూ నమ్మించాడు. తనకు జూబ్లీహిల్స్‌లో జ్యువెలరీ షాపు ఉందని, ఆమె బంగారు గొలుసును రీమోడలింగ్ చేసి తీసుకొస్తానని నమ్మించాడు.
ఆమె వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును తీసుకొని వెళ్లాకా.. మరింత బంగారం కలపాలని చెప్పి రూ. లక్ష నగదును తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గమనించిన భాదితురాలు కెపీహెచ్బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు కొనసాగుతుండగా నిందితుడు ఈ నెల 4న జెఎన్టీయూహెచ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో విచారించగా పలు పోలీస్స్టేషన్లలో ఇదే తరహాలో ఫిర్యాదులు నమోదు అయ్యాయని తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
రైతులకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ : రేగా కాంతారావు
Harish Rao | కాళేశ్వరం రిపోర్టుపై హరీశ్‌రావు పీపీటీ.. కరెంట్ కట్ చేసిన కాంగ్రెస్ సర్కార్