కొత్తగూడెం అర్బన్, ఆగష్టు 5 : తెలంగాణ రాష్ట్ర రైతులకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు అని, కరువు కాటకాలతో అల్లాడిన రాష్ట్ర ప్రజానీకానికి ముందుచూపుతో నాడు కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షప్రసారం చేయగా.. ఈ కార్యాక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు హాజరై సావధానంగా విన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడుతూ..కాళేశ్వరంపై వేసిన పినాకీ ఘోష్ కమిషన్ పూర్తిగా కాంగ్రెస్ కమిషన్ గా పనిచేసిందని, అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కమిషన్ రిపోర్టు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కరువు, కాటకాలతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బతుకుదెరువు కోసం వలస పోయిన తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పడ్డాక తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకొని గౌరవంగా బ్రతుకుతున్నారని, అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చి ఇక్కడ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని నవ్వులపాలు చేయాలనుకొని కుట్రలకు తెరలేపిందన్నారు.
కానీ వాళ్ళు చేస్తున్న పనుల వల్లే ప్రజల ముందు నవ్వులపాలవుతున్నారని గుర్తు చేశారు. మూడేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని, అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సంకుబాపన అనుదీప్, భద్రాచలం పార్టీ ఇన్చార్జ్ మానె రామకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మంతపురి రాజుగౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, సిలివేరు సత్యనారాయణ, జయరాం, కాంపెల్లి కనకేష్, సింధు తపస్విని, పోతురాజు రవి, వి. పూజిత, భూపతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.