Shamirpet | శామీర్‌పేట, ఏప్రిల్ 28 : శామీర్‌పేట ఎస్సై పరశురాం ఏసీబీకి చిక్కాడు. ఓ కేసులో లంచం డిమాండ్ చేస్తుండటంతో వలపన్ని అతన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీధర్ వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లిలో వంట నూనె వ్యాపారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు నూనె దొంగతనం చేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన యజమాని నిందితుల కోసం ఆరా తీయగా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సదరు వ్యాపారి శామీర్‌పేట పోలీసులను ఆశ్రయించాడు. ఎలాంటి కేసు లేకుండా దొంగలను వెతికి పట్టుకునేందుకు రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు వ్యాపారి ఒప్పుకోవడంతో ఎలాంటి కేసు పెట్టకుండానే నూనె రికవరీ చేసి ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం ఎస్సైకి వ్యాపారి రూ.2 లక్షలు ఇచ్చాడు.
ఇదిలా ఉంటే దొంగతనం చేసిన వ్యక్తులను కేసు నుంచి తప్పించి, సెల్‌ఫోన్ తిరిగి ఇవ్వడానికి రూ.25వేలు ఎస్సై పరశురాం డిమాండ్ చేశారు. చివరకు ఇరువురి మధ్య రూ.20వేలు తనకు మరో రూ.2వేలు కానిస్టేబుళ్లకు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనిపై నిందితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం నాడు రూ.22వేలను ఇవ్వడానికి బాధితులు రాగా తన టేబుల్ వద్ద ఉన్న డస్ట్‌బిన్‌లో వేయాలని ఎస్సై సూచించారు. ఆ మేరకు వారు డస్ట్‌బిన్ డబ్బులను వేసి, బయటికి రాగానే ఏసీబీ అధికారులు రంగం ప్రవేశం చేసి, ఆ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైని అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏసీబీ ఏసీపీ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ఏబీసీ టోల్‌ఫ్రీ నెంబరు1064 ను సంప్రదించాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్@తెలంగాణ ఏసీబీ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.