AC Bus Services | బాలానగర్, మార్చి 27 : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 4 కొత్త ఏసీ బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కూకట్పల్లి డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కొండాపూర్ మీదుగా లింగంపల్లి చేరుకునే బస్సు రూట్ ఏకే రూట్ అని పిలవబడుతుందని పేర్కొన్నారు. ఈ బస్సు లింగంపల్లి నుండి చందానగర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళుతుందని తెలిపారు.
ఈ బస్సులో 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు బయల్దేరుతుందని తెలిపారు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి జేఎన్టీయూ మీదుగా మియాపూర్‌కు చేరుకునే బస్ రూట్‌ను ఏజె రూట్‌గా పిలవబడుతుందని తెలిపారు. మియాపూర్ నుండి వయా జేఎన్టీయూ మీదుగా శిల్పారామం, హైటెక్ సిటీ, రాయదుర్గం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి మీదుగా ప్రతి 15 నిమిషాలకు ఒక ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఏకే రూట్ బస్సు కు రూ.250లు, ఏజే రూట్ బస్సుకు రూ.300 లు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రయాణికులు గమనించి ఆయా బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.