ABVP | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 2 : తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఫూల్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుందని, ఈ గుంట నక్క ప్రభుత్వం హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాలను కబ్జా చేయాలనే ప్రయత్నం మానుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్య సమితి సభ్యుడు మృత్యుంజయ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా చింతల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఐడీపీఎల్ సిగ్నల్ వద్ద ఇవాళ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవ వైవిధ్యానికి ప్రతీకైనా ఈ అటవీ ప్రాంతాన్ని కబ్జా చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కేటాయించడం సముచితమైన నిర్ణయం కాదని హెచ్చరించారు. లంగ్స్ ఆఫ్ హైద్రాబాద్‌గా పేరుగాంచిన ఈ అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తూ భావితరాలకు భవిష్యత్తు లేకుండా, ఎన్నో జీవరాశులకు గూడు లేకుండా చేసే ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో రాబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు.
మొన్న జయశంకర్ యూనివర్సిటీ, నేడు హెచ్‌సీయూ ఇలా యూనివర్సిటీలను కబ్జా చేసే ప్రయత్నం చేస్తే, ఖబర్దార్ అన్ని యూనివర్సిటీలు ఏకమై ప్రతిఘటించాల్సి వస్తుందన్నారు. మీ ఇందిరమ్మ రాజ్యంలో మీ ఇందిరమ్మ స్థాపించిన హెచ్‌సీయూను నాశనం చేయడం సరికాదన్నారు.
నేడు ప్రభుత్వ తీరు ఎలా ఉంది అంటే ఓడ ఎక్కే వరకు ఓడ మల్లన్న, ఓడ ఎక్కిన తర్వాత బోడ మల్లన్న అన్నట్టుగా ఉంది. అధికారమే పరమావధిగా ఉన్న మీ నిర్ణయాలు, తెలంగాణ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్, భాగ్యనగర్ సంయుక్త కార్యదర్శి వివేక్, కొంపల్లి నగర సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, మహేష్, మనోజ్, దేవేందర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.