కాప్రా, డిసెంబర్ 15 : జీహెచ్ఎంసీ 16వ వార్డును కుషాయిగూడ డివిజన్‌గా మార్చాలని కోరుతూ కాప్రా సర్కిల్ కార్యాలయం ఎదుట సోమవారం స్థానికులు భారీఎత్తున ధర్నా నిర్వహించారు. కుషాయిగూడ, చర్లపల్లి కాలనీల కుటుంబాలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్లేకార్డులు పట్టుకొని సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అంతకు ముందు వారు సీసీఎస్ ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్‌స్టాండ్ నుంచి డప్పు చప్పుళ్లతో ఈసీఐఎల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారుల, డీసీ, సర్కిల్ అధికారుల మొండి వైఖరి నశించాలని నినదించారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, సీసీఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మారెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్రగల కుషాయిగూడ ప్రాంతంను డివిజన్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల వద్దకు చేరుకున్న డీసీ జగన్‌కు వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ, చర్లపల్లి పరిసర కాలనీల ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.