Kowkur Dargah | జవహర్‌నగర్, ఏప్రిల్ 6: కౌకూర్ దర్గాకు దర్శనానికి వచ్చిన ఆ కుటుంబంలో విషాదమే మిగిలింది. దర్శనానికి ముందు స్నానం కోసం చెరువులో దిగిన వ్యక్తి ఆ నీటిలోనే మునిగి మరణించాడు.
జవహర్‌నగర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ గౌస్(35), భార్య ఇద్దరు పిల్లలతో కలిసి యాప్రాల్‌లోని కౌకూర్ దర్గాకు శనివారం వచ్చాడు. స్నానం చేయడం కోసం దర్గా దగ్గరలో ఉన్న చెరువులో దిగాడు. అయితే లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు.. గౌస్ కోసం వెతగ్గా ఎంతకీ కనిపించలేదు. దీంతో వెంటనే జవహర్‌నగర్ పోలీసులకు కుటుంబసభ్యులు సమాచారం అందించారు.
కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. గౌస్ చెరువులో మునిగి 24 గంటలు గడిచినా మృతదేహం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. మృతదేహం బయటకు తీసేందుకు పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.