సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు సక్రమంగా వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రతి పాఠశాలపైనా రిపోర్ట్ తీసుకుంటానని తెలిపారు.
నెలకంటే ఎక్కువ రోజులు రాని విద్యార్థుల పేర్లు ఎఫ్ఆర్సీ నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, ప్రజావాణిలో భాగంగా 147 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీస్) కదిరవన్, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్ సింగ్, జిల్లా అధికారులు ఆశన్న, యాదయ్య, జిల్లా ఇంటర్ విద్యాధికారి వడ్డెన్న, కోటాజీ, రాజేందర్ పాల్గొన్నారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యం.!
ముగ్గురికి షోకాజ్ నోటీసులు
వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను హెచ్చరించారు. సమయానికి విధులకు హాజరు కాకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బంజారాహిల్స్‌లోని విమలానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది వివరాలు ఆరా తీసి, ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది విజయలక్ష్మి, నాగలక్ష్మి, పార్వతిలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలిచ్చారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగకార్తీక్ తదితరులు ఉన్నారు.