కొడంగల్, ఫిబ్రవరి 17 : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించేందుకు వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, మహంక్మిట్టల్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలతో కలిసి శనివారం కడా కార్యాలయంలో పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు.
ముందుగా స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడారు. సంఘాల పనితీరు, సభ్యుల కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, పిల్లల చదువు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి, జీవనోపాధికి ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలను స్థాపించాలని యోచిస్తుందన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళ ల్లో మనోధైర్యం పెరుగుతుందన్నారు.
మహిళలు ఇంకా వృద్ధిలోకి వ చ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సభ్యులను అడిగి తెలుసుకున్నా రు. మహిళా సంఘాల సభ్యులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అనంతరం కొడంగల్ పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, స్థలాల పరిశీలన, వేంకటేశ్వరాలయ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.