ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 31 : నిత్యం ప్రజల్లో ఉండే తనను కాదని.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించటం ఎంతో బాధగా ఉందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నాయకుడు మర్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని సాయి ఫంక్షన్ హాల్లో ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. వారి సేవకే జీవితాన్ని అంకితం చేసిన తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల సమయంలోనే వచ్చి పోయే.. అస్సలు ప్రజల సమస్యలను పట్టించుకోని మల్రెడ్డి రంగారెడ్డికి ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆదిబట్ల సర్పంచ్‌గా ప్రారంభమైన నా జీవితం, ఎంపీటీసీగా, ఎంపీపీగా, కౌన్సిలర్‌గా కొనసాగినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తానన్నారు. నా భార్య జడ్పీటీసీగా గెలుపొంది నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నదన్నారు.
బీఫామ్ వస్తుందన్న నమ్మకముంది..
ఏనాడూ ప్రజల బాగోగులు చూడని మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ వచ్చినా.. ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేసే తనకే బీఫామ్ వస్తుందనే నమ్మకముందని నిరంజన్‌రెడ్డి అన్నారు. కుటుంబీకులు, అనుచరులు, పార్టీ నాయకులు, ఎంఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో ఆలోచించి రెండు,మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా నా జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మోతీరాంనాయక్, ఏదుళ్ల జంగారెడ్డి, దెంది రాంరెడ్డి, గజ్జి రామకృష్ణ, లక్ష్మణ్, వాజిద్, టేకుల కమలాకర్‌రెడ్డి, ఉదయ్పాల్రెడ్డి, కృష్ణ, మూర్తి, మహేశ్‌గౌడ్, పలువురు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, ఎంఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.