ఇబ్రహీంపట్నం, జూన్ 4 : మరో వారం రోజుల్లో పాఠశాలల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇంటికి సుదూరంగా ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాలలను ఎంచుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో వారిని డ్రాప్ చేయడం, పికప్ చేసుకోవడంలాంటి వెసులుబాటు అందరికీ లేకపోవడంతో చాలా వరకు స్కూల్ బస్సులు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్లు, ఫీజు వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ.. బడి బస్సులపై చూపడంలేదనే ఆరోపణలున్నాయి.
పాత వాహనాలకు కొత్తగా రంగులద్ది రోడ్లపై యథేచ్ఛగా తిప్పుతున్నాయి. తక్కువ వేతనానికి పనిచేసే ఎలాంటి అనుభవం, అర్హత లేని డ్రైవర్లను నియమించుకుని పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఫిట్నెస్లేని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించాల్సింది పోయి.. యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి కండిషన్ సరిగ్గాలేని బస్సులకు సైతం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు పెద్దఎత్తున వినబడుతున్నాయి.
రంగారెడ్డిజిల్లా నగర శివారుల్లో విస్తరించి ఉన్నందున తుర్కయాంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, బొంగుళూరు, ఇబ్రహీంపట్నం, సీతారాంపేట్, మంచాల, ఆరుట్ల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, పెద్దఅంబర్పేట్తోపాటు ఇతర నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ప్రతి గల్లీకో పాఠశాలను నెలకొల్పి ఫిట్నెస్లేని బస్సుల్లో విద్యార్థులను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ఆయా పాఠశాలల యాజమాన్యాలు.
సుమారు 50 శాతం మంది విద్యార్థులు స్కూల్ బస్సులను ఆశ్రయిస్తుండగా, మరో 25 శాతం మంది ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 15 శాతం మంది తల్లిదండ్రులు వారి పిల్లలను బైకులు, కార్లల్లో వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు పెద్దఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు నగర శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఫిట్నెస్లేని బస్సులు.. అనుభవం లేని డ్రైవర్లు..
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాత బస్సులను కొనుగోలుచేసి వాటికి పైపై రంగులు అద్ది ఫిట్నెస్లేని బస్సులు, అనుభవంలేని డ్రైవర్లతో విద్యార్థులను తరలిస్తూ వారిని ప్రమాదాలకు గురిచేస్తున్నా ఆర్టీఏ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫిట్నెస్లేని బస్సుల కారణంగా తరచూ ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులు మృత్యువాతకు, గాయాలపాలు కావడానికి కారణమవుతున్నాయి.
గతంలో షాద్నగర్, హయత్నగర్, చేవెళ్ల, శంకరపల్లి, ఇబ్రహీంపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో పాఠశాల బస్సులకు సంబంధించిన ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు. తర్వాత బడి బస్సుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురైనా తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను బస్సుల్లోనే పంపిస్తున్నారు.
పాటించాల్సిన నిబంధనలు
కఠిన చర్యలు తీసుకోవాలి
ఫిట్నెస్లేని బస్సులను నడుపుతూ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. బస్సుచార్జీల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఫిట్నెస్ లేకుండా, అనుభవంలేని డ్రైవర్లతో ప్రమాదాలు జరుగుతున్నందున ఆర్టీఏ అధికారులు తగు సూచనలు, సలహాలివ్వాలి.
– అవుతాపురం రవీందర్
అనుభవమున్న డ్రైవర్లనే నియమించుకోవాలి
ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవం లేని డ్రైవర్లను తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నారు. డ్రైవర్లు అజాగ్రత్తతోపాటు సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం, ఆర్టీఏ అధికారులు స్పందించి అనుభవంలేని డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంటున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
– బాలకృష్ణాగౌడ్