రంగారెడ్డి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితంగానే రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి గ్రామంలో నూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేస్తూ ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర సాధనకు సుదీర్ఘ పోరాటం చేశారని, చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తాగు, సాగు నీరందించారన్నారు. తెలంగాణ అనేక రాష్ర్టాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. జాతీయ దినోత్సవాల్లో ఎలా సంబురాలు జరుపుకొంటామో.. సోమవారం కూడా జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబురాలు చేసుకోవాలన్నారు.