ఇబ్రహీంపట్నం, జూన్ 20 : 30 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని.. హామీల అమ ల్లో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్తు, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి.. రైతుబంధు పథకం ద్వారా రూ.72 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించినట్టు గుర్తు చేశారు.
కాంగ్రెస్ పా ర్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారన్నారు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయకుండా..రైతుభరోసాను సక్రమంగా అందించకుండా రైతన్నకు ధోకా చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో యాసంగి, వానకాలం పంటల ఉత్పత్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిందన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్పై విమర్శలు చేయ టం తగదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలులో సర్కార్ పూర్తిగా విఫలమైందని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే రైతుల నుంచి సేకరించిందని.. మిగిలిన యాభైశాతం ధాన్యం కల్లాల్లోనే మూలుగుతున్నదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మ న్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ఉత్తమరైతు అంజిరెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మాజీ ఎం పీపీ కృపేశ్, మండలపార్టీ అధ్యక్షుడు బుగ్గరాములు, రమేశ్, రమేశ్‌గౌడ్, వేణుగోపాల్‌రావు, జగదీశ్వర్, రాజ్‌కుమార్, శేఖర్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బహదూర్, రవీందర్‌తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత 15 రోజుల వ్యవధిలో రేవంత్‌రెడ్డి నాలుగుసార్లు పర్యటించారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని ఒక్క రూపాయి కూడా అడగని దరిద్య్రపు ఎమ్మెల్యే ఉండటం మన దౌర్బాగ్యమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడల్లా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించినట్టు ఆయన గుర్తు చేశారు. మల్రెడ్డి రంగారెడ్డికి నియోజకవర్గాభివృద్ధి కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఆరుట్ల గ్రామ సర్పంచ్ గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆమె వినతిపత్రాన్ని స్వీకరించకుండా ముఖ్యమంత్రి పక్కన పెట్టడం సరైంది కాదన్నారు.