రంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : ఫార్మాసిటీ భూసేకరణలో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలకు దమ్ముంటే చర్చ కు రావాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈనెల 17న శుక్రవారం యాచారం మండలంలోని మేడిపల్లిలో బహిరంగ చర్చ కు తాను సిద్ధమని..ఉదయం 10 నుంచి 11గంటల వరకు అక్కడే ఉంటానని.. ఫార్మాసిటీ బాధిత గ్రామాలైన కుర్మిద్ద, నానక్‌నగర్, తాటిపర్తి గ్రామాలకు చెందిన పలువురు రైతులు కూడా అక్కడికి వస్తారని దమ్ముంటే వచ్చి వారి ఎదుట తాను డబ్బు లు తీసుకున్నట్టు రుజువు చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు సూచించారు.
ఫార్మాసిటీ భూముల పరిహారంలో తాను ఏ ఒక్క రైతు నుంచి రూపాయీ తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఫార్మాసిటీ కోసం భూముల సేకరణ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, రైతులను ఒప్పించి.. మెప్పించి తీసుకుని వారికి పరిహారం ఇచ్చామన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మల్రెడ్డి రంగారెడ్డి అందరూ తనలాగే ఉంటారని భ్రమలో ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఆస్తులపైనా.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి రెండున్నరేండ్లలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు, కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న కమీషన్లు, రియల్ఎస్టేట్ సంస్థలను బెదిరించి తీసుకున్న డబ్బులపైనా సీబీఐ విచారణకైనా సిద్ధమని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే, తొర్రూరులోని సర్వేనంబర్ 38లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాచేసి ఆలయ నిర్మా ణం పేరుతో ఎమ్మెల్యే రంగారెడ్డి పెద్ద ఎత్తు న చందాలు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కొహెడ గ్రామంలో 172 ఎకరాల భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పండ్ల మార్కెట్‌కు కేటాయిస్తే భువనగిరి ఎంపీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కలిసి ఆ భూమి ని టీజీఐఐసీకి మళ్లించి.. దానిని కొట్టేసేందుకు యత్నిస్తున్నదని నిజం కాదా అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను తాము అధికారంలోకి రాగానే తిరిగి రైతులకు అప్పగిస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే, ఎంపీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి రైతులను నట్టేట ముంచారన్నారు. ఫార్మా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవటంతో ఆ గ్రామాల రైతులు వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన గుణపాఠం తప్పదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు బుగ్గరాములు, గిరి, బీఆర్ఎస్ నాయకులు శివసాయి, మల్లేశ్, సుల్తాన్, సురేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ స్థాయీ కేసీఆర్, కేటీఆర్‌ను విమర్శించేదా?
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించే స్థాయి భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలకు లేద ని.. స్థాయిని మరిచి దిగజారుడు రాజకీయాలు చేస్తే సహించేదిలేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని..తీసుకొచ్చిన తెలంగాణను పదేండ్ల కాలంలో దేశంలో నే అగ్రభాగంలో నిలిపారని కొనియాడారు. అలాంటి కేసీఆర్‌ను ఆయన కుమారుడు కేటీఆర్‌ను సిగ్గు, ఎగ్గూ లేకుండా విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్‌ను తిడితే ముఖ్యమంత్రి వద్ద పరపతి పెరిగి మంత్రి పదవి వస్తుందనే భ్రమలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాగే, ఎంపీగా గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి రెండేన్నరేండ్లు దాటినా నియోజకవర్గంలో ఏ గ్రామం ఎక్కడుంతో తెలియని దుస్థితి ఉందన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికీ రూపాయీ విదల్చని ఆయన రాజకీయ అజ్ఞానంతో కేసీఆర్‌ను విమర్శించటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని.. సంక్షేమం కార్యక్రమాలు ప్రజలకు అందడంలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం.. కాంగ్రెస్ పాలనలో అట్టడుగు స్థానానికి చేరిందని ఎద్దేవా చేశారు.