వ్యవసాయ శాఖ అధికారుల నిలదీస్తున్న రైతులు..
రెండు ఎకరాల భూమి ఉంటే 20 గుంటలకే డబ్బులు జమ
Rythu Bharosa | మంచాల, జూన్ 25 : పంట పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసా కొంతమేర భూమికే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతు భరోసా డబ్బులు ఖాతాలో తక్కువ పడడంతో వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ రైతుల నిత్యం తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తమకు పడవలసిన డబ్బులకంటే తక్కువగా రైతు భరోసా పడినాయని తమకు మిగతా డబ్బులు ఎప్పుడు జమవుతాయని నాకు నాలుగు ఎకరాల భూమి ఉంటే అందులో రెండు ఎకరాలప పైసలు పడినాయని మిగతా భూమికి ఎప్పుడు డబ్బులు పడతాయని అధికారులను నిలదీస్తుండడంతో చేసేదేమీ లేక అధికారులు తొందరలోనే డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయని చెప్పి తప్పించుకుంటున్నారు.
మంచాల మండలంలోని 23 గ్రామపంచాయతీ లతోపాటు ఆరు అనుబంధ గ్రామాల్లో 32 వేల ఎకరాల భూమి ఉండగా అందులో 17 వేల ఎనిమిది వందల మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మంచాలకు చెందిన బీరప్పకు నాలుగు ఎకరాల భూమి ఉండగా అందులో కొంత భూమికి మాత్రమే డబ్బులు పడినాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాపాల గ్రామానికి చెందిన బక్కున్న చంద్రకాంత్ కు 18 గుంటల భూమికి మాత్రమే డబ్బులు పడినాయని మిగతా భూమికి ఎప్పుడు డబ్బులు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనకున్న రెండు ఎకరాల భూమికి రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికి రెండుసార్లు కొద్ది భూమికి మాత్రమే రైతు భరోసా పడినాయని ఇదేం ప్రభుత్వమని మండిపడుతున్నాడు. రైతుల పెట్టుబడి సాయం కోసం గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 6000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమచేస్తే అట్టి డబ్బులను పంట పెట్టుబడి కోసం ఉపయోగించుకునే వాళ్లమని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా సక్రమంగా రైతు భరోసా డబ్బులు జమ కావకపోవడంతో పంట పెట్టుబడి కోసం మళ్లీ గ్రామాలలో ఉన్నసావుకారులు,వ్యాపారుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి మళ్లీ గ్రామాలలో కనిపిస్తుంది. రైతులకు ఎంతగానో అండగా ఉండవలసిన ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం ఇవ్వకపోగా, సబ్సిడీపై విత్తనాలు ఎరువులు కూడా దొరకగా ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో కొనుగోలు చేయవలసిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. రైతు ప్రభుత్వంలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయి
రెండు ఎకరాలు ఉంటే ఒక ఎకరాకు డబ్బులు : మొగిలి వెంకటేష్, మంచాల
మంచాలలో నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో రెండు ఎకరాల కు రైతు భరోసా పడవలసి ఉండగా ఒక్క ఎకరాకు మాత్రమే రైతు భరోసా డబ్బులు పడినాయి. గత ప్రభుత్వంలో తనకున్న పట్ట భూమికి మొత్తం రైతు భరోసా డబ్బులు పడినాయి. ఇప్పుడు మాత్రం కొద్ది భూమికి మాత్రమే డబ్బులు వేసినారు. మిగతా భూమికి డబ్బులు అడుగుతే వస్తాయని చెప్పి అధికారులు దాటవేస్తున్నారు.