రంగారెడ్డి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. ఎంపిక చేసిన వాటిల్లో సగం పాఠశాలల్లో కూడా నేటికీ పనులు పూర్తి కాలేదు. పనులు జరుగుతున్న తీరును చూస్తే.. పూర్తిస్థాయిలో పనులు అయ్యేసరికి పుణ్యకాలం గడుస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చాలా పాఠశాలల్లో సదుపాయాల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండగా.. అమ్మ ఆదర్శ పనుల్లో నెలకొన్న జాప్యం కారణంగా విద్యార్థులు ఈ ఏడాది ఆసాంతం సమస్యల నడుమే చదువులను కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సరైన పర్యవేక్షణ లేక ఈ దుస్థితి నెలకొన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సా..గుతున్న సదుపాయాల పనులు..
జిల్లాలో మొత్తం 1,342 పాఠశాలలు ఉండగా.. మన ఊరు-మన బడి, పీఎం శ్రీ పథకాల కింద ఎంపిక కాకుండా మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 762 పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులను గత విద్యాసంవత్సరం చివరలోనే అధికారులు గుర్తించారు.
ప్రధానంగా పాఠశాలల్లో ఐదు రకాల సమస్యలు నెలకొన్నట్లు గుర్తించి ఆయా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. భవనాలకు మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సమస్యలతోపాటు బాలికలకు మరుగుదొడ్లు లేని చోట పనులు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేశారు. ఇప్పటివరకు 358 స్కూళ్లలోనే పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిల్లో అంతంత మాత్రంగానే కదలిక ఉన్నట్లు తెలుస్తున్నది.
అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పనుల్లో జాప్యం నెలకొంటున్నట్లు తెలుస్తున్నది. కొన్ని పాఠశాలల్లో గోడలు దెబ్బతినడం, మరికొన్నింటిలో పై కప్పులు శిథిలావస్థకు చేరడంతో వానకాలంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యవేక్షణ కొరవడడం వల్లనే పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికే అన్ని పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. నేటికీ కొనసాగుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.
అటకెక్కిన ‘మన ఊరు-మన బడి’ పనులు..
రంగారెడ్డి జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపు తీసుకొచ్చింది. ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 468 పాఠశాలలు ఎంపికకాగా.. 448 పాఠశాలలకు రూ.97.88కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను ఇచ్చింది. దాదాపు 65 పాఠశాలల్లో పనులు పూర్తికాగా పాఠశాలలను పునః ప్రారంభించారు.
పలుచోట్ల పనులు అసంపూర్తి దశలోనే ఉన్నాయి. బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తున్న కారణంగానే కాంట్రాక్టర్లు మిగిలిపోయిన పనుల పూర్తికి శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వం సైతం గత ప్రభుత్వ పనులపై పర్యవేక్షణ గాలికి వదిలేసింది. దీంతో మన ఊరు-మన బడిలో చేపట్టాల్సి ఉన్న పనులు అటకెక్కినట్లేనన్న ప్రచారం జరుగుతున్నది.