వికారాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : జిల్లా పోలీస్ శాఖను భారీగా ప్రక్షాళన చేశారు. అవినీతి, వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు జిల్లాలో ఒకేసారి 35 మంది ఎస్ఐలను బదిలీలు, పోస్టింగ్‌లు కల్పిస్తూ ఎస్పీ నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి 12 మంది ఎస్‌హెచ్‌వోలను స్థానచలనం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా పలువురు సబ్ ఇన్స్పెక్టర్లపై వసూళ్లు, అవినీతి ఆరోపణలు వస్తుండటంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేసేందుకు పలుమార్లు చూసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో ఒకట్రెండుసార్లు బదిలీలకు బ్రేక్ పడింది. రాజకీయ నాయకుల అండతో మరింత వసూళ్లు, పోలీస్ స్టేషన్లలోనే సెటిల్మెంట్లు ఎక్కువ కావడంతో పలువురు ఎస్ఐలపై బదిలీ వేటు వేసినట్లుగా తెలిసింది. జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లను సెటిల్మెంట్లకు అడ్డాగా కొందరు ఎస్ఐలు మార్చారనే ఆరోపణలున్నాయి.
సివిల్(భూ తగాదాలు) వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ పోలీస్ ఉన్నతాధికారులు ప్రతీ సమావేశంలోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ కొందరు ఎస్ఐలు తీరు మార్చుకోకపోవడం గమనార్హం. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిత్యం భూ తగాదాలకు సంబంధించి పోలీసు అధికారులు స్టేషన్లలోనే సెటిల్మెంట్లు చేస్తూ వసూళ్లకు అడ్డాగా మార్చుకున్నారనే ప్రచారం జరిగింది. పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న భూ సెటిల్మెంట్లలో అమాయక పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వచ్చాయి.
డబ్బులిచ్చే వారివైపే నిలుస్తూ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వచ్చే పేద ప్రజలకు అన్యాయం చేస్తూ పోలీస్ శాఖకు మాయని మచ్చగా కొందరు పోలీసు అధికారులు మారారనే విమర్శలు రావడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసినట్లు సమాచారం. అయితే భూ తగాదాల్లో తలదూరుస్తూ, పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లకు పాల్పడుతున్న చన్గోముల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిపై ఇటీవల బదిలీ వేటు వేసిన పోలీసు ఉన్నతాధికారులు.. తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ బదిలీ చేశారు.
మరోవైపు ప్రతీసారి బదిలీల సమయంలో రాజకీయ నాయకుల అండతో బదిలీ కాకుండా చూసుకుంటున్న అవినీతి పోలీసుల ప్లాన్‌కు ఈసారి బ్రేక్ పడింది. నిబంధనల ప్రకారం ప్రొబేషనరీ పూర్తైన ఎస్ఐలకు తప్పనిసరిగా పోస్టింగ్ ఇవ్వాలని నిబంధన ఉండడంతో ఇదే సాకుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ బదిలీ చేసి.. వారి స్థానంలో ప్రొబేషనరీ పూర్తైన కొత్తవారికి ఎస్హెచ్వోలుగా బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐలకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐలను కూడా త్వరలో బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.