పెద్దఅంబర్‌పేట, ఏప్రిల్ 26 : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ కుంట్లూరులోని రావినారాయణరెడ్డి ఫేజ్-3 కాలనీలో శనివారం మధ్యాహ్నం గుడిసెల్లో ఆకస్మికంగా అగ్నిప్రమాదం జరిగింది. మొదట ఒక్క గుడిసెలో చెలరేగిన మంటలు విస్తరించడంతో సుమారు 450 గుడిసెలు దగ్ధమయ్యాయి. వాటిలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధితులు తమ గూడు చెదిరిందని గుండెలవిసేలా రోదించారు.
సుమారు 40 గ్యాస్ సిలిండర్లు పేలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేశాక, నిప్పును ఆర్పివేయకపోవడంతో మంటలు అంటుకుని చెలరేగాయా? ఓ గుడిసెలో వంట గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడం, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వందలాది గుడిసెలకు మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున పొగ కమ్ముకున్నది. వృద్ధులు, చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా.. నాలుగు ఫైరింజన్లు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. స్థానికులు సైతం సాయం చేసేందుకు ముందుకు రావడంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి కొంత సులువైంది.
హయత్‌నగర్ పోలీసులతోపాటు సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు చేరుకుని సహాయ సహకారాలు అందించారు. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని.. పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. దగ్ధమైన గుడిసెలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు పరిశీలించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కళాకారులతో భద్రతా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.
భూదాన్ భూమిలో వేసుకున్న గుడిసెల్లో మంటల ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఇందులో కుట్రపూరితమేమైనా ఉన్నదో ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రావినారాయణరెడ్డి కాలనీలో శనివారం ఆయన పర్యటించారు. కాలిన గుడిసెలను పరిశీలించారు. బాధితులకు బియ్యం, ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
గతంలో సింగరేణి కాలనీలో ఇచ్చిన మాదిరిగా, ఇక్కడ గుడిసెవాసులందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుడిసెల్లో మంటలు చెలరేగడం వెనుక భూస్వాముల కుట్ర దాగి ఉన్నదని సీపీఐ నాయకులు రవీంద్రాచారి, యాదిరెడ్డి ఆరోపించారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ భూమిని సొంతం చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నవారే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.