ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కనుల పండువగా జరిగాయి. శైవ క్షేత్రాలు వేకువ జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమః శివాయ, హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉపవాస దీక్షలు స్వీకరించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి విరమించారు. ముక్కంటికి మొక్కులు చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. మహేశ్వరంలోని శివగంగ ఆలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి దంపతులు, పలువురు ప్రజాప్రతినిధులు రాజరాజేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు శివ లింగాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె తదితరవాటితో అభిషేకాలు నిర్వహించారు. శివాలయాల్లో శివపార్వతుల కల్యాణాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు వైభవంగా జరిగాయి. ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయాల కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శివాలయాలు ఓం నమ ః శివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు పరమశివుడికి ప్రత్యేక పూజ లు చేశారు. దీంతో ఆలయాలు జనసంద్రంగా మారాయి. శివలింగాలకు పాలు, పెరుగు, నెయ్యి, తేనెలతో అభిషేకాలు, అర్చనలు చేశా రు. భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫరూక్నగర్ మండలంలోని రామేశ్వరంలో ఉన్న ఉత్తర రామలింగేశ్వరాలయానికి భక్తు లు పోటెత్తారు. యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని పురాతనమైన నందీశ్వర మహాక్షేత్రం, సిద్ధేశ్వరాలయం, ఓంకారేశ్వరాలయం, నల్లవెల్లిలోని రామలింగేశ్వరాలయం, గాండ్లగూడలోని మల్లికార్జున ఆలయం, గునగల్లోని శివాలయం, కొత్తపల్లిలోని వేంకటేశ్వర స్వామి ఆలయాలతోపా టు వికారాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు తెల్లవా రు జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి మహేశ్వరంలోని శివగంగ ఆలయంలోని రాజరాజేశ్వరుడికి, రామలింగేశ్వరుడికి ప్ర త్యేక పూజలు చేశారు. అలాగే, గట్టుపల్లిలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివుడికి అభిషేకం చేశారు. ‘ప్రజలు సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుడిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా మహేశ్వరంలోని శివగంగ రాజరా జేశ్వరుడికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్‌నగర్ పరిధిలోని రామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ‘ఆ పరమ శివుడి కరుణ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని’ కోరుకున్నట్లు ఆయన తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య వికారాబాద్ జిల్లాలోని బుగ్గ రామలింగేశ్వరాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకు న్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్‌లోని శ్రీబుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.