నందిగామ, జనవరి 11 : ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మహర్షి వేదిక్ సంస్థ గురువు టోని నాడార్ అన్నారు. నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక సంస్థ మహర్షి వేదిక్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం 10 వేల మందితో 13 రోజులుగా ధ్యాన అసెంబ్లీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గురువారం గ్లోబల్ యూనియన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఫర్ పీస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నాడార్ హాజరై మాట్లాడుతూ.. ధ్యానం చేయడంతో వ్యక్తిగత, ప్రపంచశాంతికి ఉపయోగపడుతుందని సాంకేతికంగా నిరూపించబడిందని తెలిపారు. ధ్యానం ద్వారా ఒత్తిడి, విసుగు చెందడం లాంటి సమస్యలను అధిగమించవచ్చన్నారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కార్యక్రమంలో పాల్గొని అధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు. ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవడం ద్వారా మానసిక ప్రశాతంత లభిస్తుందన్నారు.
శ్రీరామచంద్ర మిషన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేసి ధ్యానం, ఆధ్యాత్మికత ద్వారా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిందన్నారు. ధ్యానం ద్వారా మానవుడు పరివర్తనం చెంది చెడు వ్యసనాలను అధిగమించి మంచి వైపు పయనిస్తాడని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రపంచంలోని 139 దేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 10 వేల మంది అభ్యాసకులు, మహర్షి వేదిక్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.