సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రామాలు అవార్డుల రేసులో ముందుంటున్నాయి. తాజాగా పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైంది. ఇది నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కాగా, నాలుగున్నరేండ్లలోనే సకల వసతులు సమకూరాయి. ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో మెరిసింది. రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్డీలో నేడు జరిగే కార్యక్రమంలో సర్పంచ్ నల్క జగన్, పంచాయతీ కార్యదర్శి సురేశ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకోనున్నారు. -పరిగి, సెప్టెంబర్ 13
పరిగి, సెప్టెంబర్ 13 : తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చదనానికి, పరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్నాయి. గతంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రారంభంలోనే పెంటకుప్పలు, రోడ్లపై మురికినీరు పారుతూ దర్శనమిచ్చేవి. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపాలు మారాయి. చిన్న గ్రామాలు సైతం అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. తద్వారా గ్రామాలు అవార్డుల రేసులో ముందు నిలుస్తున్నాయి. పరిగి మండలం రాఘవాపూర్ గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పాటు చేయబడగా, నాలుగున్నర సంవత్సరాల కాలంలో గ్రామం అభివృద్ధిలో మొదటి వరుసలో నిలిచింది. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అందుకోబోతున్నారు. రాఘవాపూర్ గ్రామపంచాయతీ జనాభా 751. సుమారు రూ.కోటితో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతోపాటు నూతనంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టారు.
పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామపంచాయతీ రాష్ట్రస్థాయి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుకు ఎంపికైంది. 14వ తేదీ గురువారం రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్డీలో జరిగే కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ నల్క జగన్, పంచాయతీ కార్యదర్శి సురేశ్‌లు అవార్డును అందుకోనున్నారు. పంచాయతీ పాలక వర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నది. మరుగుదొడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, మురుగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇంకుడు గుంతల నిర్మాణం, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత, వాల్ పెయింటింగ్స్, తడి, పొడి చెత్త సేకరణ, ఎరువుల తయారీ, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య చర్యలు వంటి అంశాల ఆధారంగా అవార్డుకు ఎంపికైంది. గ్రామంలో 174 ఇండ్లు ఉండగా, 174 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఉపయోగిస్తున్నారు.
రెండు గుంతలతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. 65 ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలో 5 ప్రధాన డ్రైనేజీలు ఉండగా, డ్రైనేజీలు పూర్తయ్యే మూడుచోట్ల సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించారు. పారిశుధ్యం, పచ్చదనం తదితర అంశాలపై 9 ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్స్ వేయించారు. వీటితోపాటు ప్రతిరోజు ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్లో ఎరువుల తయారీ సైతం చేపడుతున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని డివైడర్‌తో కూడిన సీసీ రోడ్డుగా వేయడంతోపాటు ఇరువైపులా మొక్కలు నాటడంతో పచ్చదనం పరుచుకున్నట్లు అందంగా కనిపిస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో చక్కటి మొక్కల పెంపకంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. తద్వారా రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు జిల్లా నుంచి రాఘవాపూర్ గ్రామపంచాయతీ ఎంపికైంది.
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ప్రత్యేక నిధుల మంజూరుతో మౌలిక సదుపాయాలను సమకూర్చుకున్నాం. గ్రామంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించి వాడుకునేలా అవగాహన కల్పించాం. దీంతో ఓడీఎఫ్ గ్రామంగా గుర్తింపు వచ్చింది. పంచాయతీ సిబ్బంది నిత్యం ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించగా, సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. గ్రామం రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉన్నది.
– నల్క జగన్, రాఘవాపూర్ సర్పంచ్