సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించే నిరుపేద రోగులకు కిందిస్థాయి సిబ్బంది తీరు శాపంగా మారుతున్నది. అయినవారు అనారోగ్యానికి గురై దవాఖానలో చేరితే వారిని చూసేందుకు వచ్చిన వారి నుంచి నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో ప్రవేశ ద్వారాల వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్ దవాఖానల్లో వార్డుల వద్ద ప్రవేశ ద్వారాల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు ఇస్తేనే లోనికి అనుమతిస్తున్నట్లు రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల వద్దకు వెళ్లేందుకు పాస్‌లు ఉన్నా.. డబ్బులు ఇవ్వనిదే అనుమతించడం లేదని వాపోతున్నారు. ఒకవేళ గట్టిగా నిలదీస్తే నిర్ణీత సమయంలోనే రావాలని చెబుతున్నారని, డబ్బులు ఇస్తే మాత్రం సమయం, సందర్భాలేవి లేకుండా అనుమతిస్తున్నట్లు రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు.
కనికరం చూపడం లేదు
రోగికి అత్యవసరమని చెప్పినా.. ప్రవేశ ద్వారా వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు కనికరించడం లేదని రోగి సహాయకులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పేట్లబుర్జు ప్రసూతి దవాఖానలో చికిత్స పొందుతున్న రోగికి అత్యవసరమని చెప్పినా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో సకాలంలో వైద్యం అందక సదరు రోగి మృత్యువాత పడ్డాడు. దీనిపై బాధితులు దవాఖాన అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పెద్దగా స్పందించలేదు. కాగా, నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులు, రోగి సహాయకులకు అక్కడ ఉన్న కొందరు కిందిస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది, ఆయాల అవినీతిపై అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి అనేకసార్లు బహిరంగంగానే హెచ్చరించి, పలువురిపై చర్యలు తీసుకున్నా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఆర్ఎంవోల అండదండలు
కొందరు ఆర్ఎంవోల అండదండలతోనే కింది స్థాయి సిబ్బంది రోగులపై తమ ప్రతాపం చూపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సెక్యూరిటీ, శానిటేషన్‌కు సంబంధించిన సూపర్వైజర్లతో దవాఖానల్లోని కొందరు ఆర్ఎంవోలు కుమ్మకై వచ్చిన దాంట్లో పంపకాలు చేసుకుంటారని, దీంతో ఎక్కువగా కలెక్షన్లు చేసే వారిని ప్రవేశ ద్వారాల వద్ద నియమించి డబ్బులు వసూళ్లు చేయడంలో వారు పరోక్ష పాత్ర పోషిస్తున్నట్లు దవాఖాన వర్గాలే ఆరోపిస్తున్నాయి. కొందరు ఆర్ఎంవోల అండదండలతో సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్వైజర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు కలెక్షన్లు అధికంగా వచ్చే వార్డులు, గేట్ల వద్ద తమకు అనుకూలమైన వ్యక్తులకు డ్యూటీలు వేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువగా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానల్లో నడుస్తున్నట్లు తెలుస్తున్నది. కొందరు పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పాల్పడుతున్న అక్రమ వసూళ్లతో నిరుపేద రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు.