షాబాద్, జూలై 2 : రైతులు తమ పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని రేగడి దోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలోని దత్తాత్రేయ గోశాలలోని పశువులకు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పశువుల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువు అనారోగ్యానికి గురైన వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో పశువులకు, జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్రీనివాస్, బాలరాజ్, విద్యాసాగర్ రైతులు తదితరులున్నారు.